• ఆల్ ఇండియా స్థాయిలో 1542వ ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో 52వ స్థానం
• 560 మార్కులతో సత్తా.. డెర్మటాలజీ పీజీ సీటే లక్ష్యంగా ముందడుగు
కుషాయిగూడ, అక్టోబర్ 12. మంచితనం న్యూస్:-ప్రతినిధి గోపగాని పాండు.
జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షలో చర్లపల్లి డివిజన్ చక్రిపురం రెడ్డి కాలనీకి చెందిన డాక్టర్ కట్కూరి భావనారెడ్డి విశేష ప్రతిభ కనబరిచారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో పరీక్షకు సిద్ధమైన ఆమె 560 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 1542వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 52వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. భావనారెడ్డి సాధించిన ఈ విజయం కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా హర్షాతిరేకాలను నింపింది.కుషాయిగూడ చక్రిపురం ప్రాంతానికి చెందిన శ్రీరామ్ బేకర్స్ అండ్ స్వీట్స్ యజమాని కట్కూరి విజయకుమార్ రెడ్డి, సుధ దంపతుల కుమార్తె భావనారెడ్డి చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. వైద్యరంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే సంకల్పంతో నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా తనకు ఇష్టమైన డెర్మటాలజీ (చర్మవ్యాధుల వైద్యం) విభాగంలో పీజీ సీటు సాధించాలనే లక్ష్యంతో నిరంతరం అధ్యయనం చేస్తూ ముందుకు సాగారు.పరీక్షకు సన్నద్ధమయ్యే క్రమంలో గత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు మాక్ టెస్టులు రాస్తూ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. సమయపాలన, నిరంతర సాధన, లక్ష్యంపై ఏకాగ్రతకు ప్రాధాన్యమిస్తూ చేసిన కృషి ఆమెకు మంచి ఫలితాన్ని అందించింది. 560 మార్కులతో జాతీయస్థాయిలో 1542వ ర్యాంకు సాధించడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ భావనారెడ్డి మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన డెర్మటాలజీ విభాగంలో పీజీ సీటు సాధించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడంతో పాటు మాక్ టెస్టులు రాస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు వివరించారు. నిరంతర సాధన, క్రమశిక్షణతో చదవడం వల్లే ఆశించిన ఫలితాన్ని సాధించగలిగానని పేర్కొన్నారు.
తమ కుమార్తె జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు విజయకుమార్ రెడ్డి, సుధ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు భావనారెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో డెర్మటాలజీ విభాగంలో పీజీ సీటు సాధించి వైద్యరంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భావనారెడ్డి సాధించిన విజయం లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ఎంత ముఖ్యమో చాటిచెప్పేలా నిలిచింది.